Telugu Moral Stories For Kids- Chandamama Kathalu

moral stories in telugu
moral stories in telugu

అనగనగా ఒక ఊరిలో పేరయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.  అతడు వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని, ఇల్లు గడవడం కష్టంగా ఉందని, ఏం చేయాలో బాగా ఆలోచించాడు. చివరికి ఒక బాతు ని పెంచి దాని గుడ్లు అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

ఒకరోజు భార్యతో  సంప్రదించి ఒక బాతు పిల్ల ని తీసుకొచ్చి పెంచసాగాడు. కొన్నాళ్లకు బాతు పిల్ల పెరిగి పెద్దదయింది. అప్పటి నుంచి బాతు గుడ్లు ఎప్పుడు పెడుతుందా అని భార్యాభర్తలిద్దరూ ఎదుర చూడసాగారు.

 ఇదిలా ఉండగా బాతు ఒక రోజు గుడ్డు పెట్టింది. వారిద్దరూ దగ్గరకు వెళ్లి చూసి ఆశ్చర్యానకి లోనయ్యారు.  అది మామూలు బాతు గుడ్డు కాదు, అచ్చంగా బంగారు గుడ్డు.

 దాంతో వాళ్ళిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక మన దరిద్రం తీరిపోయిందని ఆనందంతో కేరింతలు కొట్ట సాగారు. అప్పటి నుంచి బాతు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక బంగారు గుడ్డు పెట్టసాగింది.

ప్రతి రోజు భార్యాభర్తలిద్దరూ బంగా బంగారు గుడ్డు ని అమ్ముకుని, బోల్డంత డబ్బు సంపాదించారు. అనతికాలంలోనే ధనవంతులు అయ్యారు.

 ఇదిలా ఉండగా ఒకరోజు దంపతులిద్దరికి దురాశ కలిగింది. ఇద్దరు ఆలోచించుకుని బాతు, రోజుకు ఒక బంగారు గుడ్డు పెడుతోంది,అంటే దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లే ఉండి ఉంటాయి, ఇలా మనం ప్రతి రోజు ఒక బంగారు గుడ్డు కోసం వేచి చూడడం కంటే, బాతు పొట్టను కోసి ఒకే సారి దాని పొట్ట లోని బంగారు గుడ్లు అన్నీ తీసుకుంటే మంచిది కదా!  అవన్నీ ఒకేసారి అమ్మేసి కోటీశ్వరులు అయిపోవచ్చు అని అనుకున్నారు.

  భార్యాభర్తలు ఇద్దరూ ఎవరినీ సంప్రదించకుండా, బాతును కోసి అన్ని బంగారు గుడ్లు ఒకే సారి తీసుకుందామనే నిర్ణయానికి వచ్చారు. మంచి సమయం చూసి పేరయ్య దంపతులు బాతు పొట్టను నిలువుగా చీల్చారు.

 తీరా కోసి చూసేసరికి దాని పొట్టలో ఒక్క బంగారు గుడ్డు కూడా వారికి కనిపించలేదు. బాతును అలా కోసేసరికి అది కాస్తా అర్ధాంతరంగా చచ్చిపోయింది. దాంతో దంపతులిద్దరూ లబోదిబో మంటూనెత్తి నోరు కొట్టుకుని విపరీతంగా ఏడవసాగారు. తమ అత్యాశకి తగిన శాస్తే జరిగిందని వాపోయారు.

 

 నీతిః దురాశ దుఃఖానికి చేటు

కాకి తెలివి- Telugu Moral Stories for kids - Chandamama Kathalu​

కాకి తెలివి- Telugu Moral Stories for kids – Chandamama Kathalu

అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది మండు వేసవి కాలం… ఒకరోజు ఎండ బాగా ఎక్కువగా ఉండడంతో  ఆ కాకి కి బాగా దాహం వేసింది.

వేడి తీవ్రత వల్ల కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది. తాగడానికి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో నని చాలా చోట్ల వెతికింది. ఎక్కడా నీళ్లు కనబడలేదు. అప్పటికే బాగా ఎగిరి ఉండడంతో పూర్తిగా అలిసిపోయింది.

ఏదో ఒక చోట దొరకపోతాయా అని నీరసంగానే నీళ్ళ కోసం వెతికింది…అయినా ఎక్కడ దానికి నీటి జాడ కనపడలేదు.  అలాగే వెతుకుతూ వెతుకుతూ ఉండగా దానికి ఒక కుండ కనిపించింది.

వెంటనే ఎంతో ఆశతో ఆ కుండ దగ్గరికి వెళ్ళింది.  బాగా దాహంతో ఉందేమో… వెంటనే ఆశగా ఆ కుండలో కి తొంగి చూసింది. కానీ నీళ్లు బాగా అడుక్కు ఉండడంతో, కాకిముక్కుకు నీళ్లు అందలేదు.

దాని ఆశ నిరాశ అయింది. నీళ్లు కనిపించినట్టే కనిపించి… తాగుదామంటే      అందలేదని బాధపడింది. కానీ అలాగే నీటిని వదిలేసి వెళ్ళబుద్ధికాలేదు. ఏం చేయాలా అని బాగా ఆలోచించింది. దాని బుద్ధికి పదును పెట్టింది. వెంటనే దాని బుర్రలో ఒక ఆలోచన చటుక్కున మెరిసింది. తక్షణమే దానిని అమల్లో పెట్టింది.

అక్కడ చుట్టుపక్కల పడున్న గులకరాళ్ళను తీసుకువచ్చి ఆ కుండలో ఒక్కొక్కటిగా పడేసింది. కుండ లోకి రాళ్ళు పడేసరికి నీళ్లు పైకి తేలాయి. వెంటనే కాకి తన దాహం తీరే దాకా నీళ్ళు తాగింది. ఆ తర్వాత ఆనందంగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది. దీనినిబట్టి తెలుసుకోదగ్గ  నీతి ఏంటంటే…

నీతి :“మనసుంటే మార్గం ఉంటుంది”. అలాగే ఎప్పుడు ఓటమిని ఒప్పుకోక గెలుపు కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సొంతమవుతుంది.

 

అది ఒక దట్టమైన కారడవి. ఆ అడవిని దాటి వెళ్తేగానీ నగరానికి చేరుకునే మార్గం లేదు. ఒక రోజు ఒక బాటసారి ఆ అడవి గుండా నగరానికి పయనమయ్యాడు. అడవిలో క్రూరమృగాలు దాడి చేస్తాయోమోనన్న భయంతో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నడక సాగిస్తున్నాడు.

ఆ అడవిలోనే వయసుడిగిపోయిన ఓ ముసలి పులి ఆకలికి నకనకలాడుతూ, ఏ జంతువును వేటాడే ఓపిక లేక, ఏం చేయాలో దిక్కు తోచక, ఒక చెట్టు చాటున నక్కి కూర్చుంది.

 బాటసారి అడవి గుండా వెళ్తూండటం ఆ ముసలి పులి చూసింది. ఆ బాటసారి మీద దాడి చేసి, చంపి ఆరగించే శక్తి దానికి లేదు. ఏదైనా పన్నాగం పన్ని బాటసారిని చంపి తన ఆకలిని  తీర్చుకోవాలనుకుంది. వేటాడే శక్తి సన్నగిల్లినప్పటి నుండి మాయోపాయాలు పన్ని మనుషులను చంపి, ఆకలితీర్చుకోవడం ఆ పులి నైజంగా మారింది. బాటసారి అటుగా రావడంతో, ముసలి పులి మెదడులో చటుక్కున ఒక మెరుపు లాంటి ఆలోచన మెరిసింది. అది అంతకుముందు ఒక మనిషిని చంపినప్పుడు అతడి చేతికున్న ఒక బంగారు కడియాన్ని తన దగ్గర దాచుకుంది. అడవిలో వడివడిగా నడుస్తున్న బాటసారి తనకు దగ్గరగా రావడంతో… లోలోపల ఆనందిస్తూ…

ఓ బాటసారి! ఇటు చూడు! ఇటురా అంటూ అనునయంగా పిలిచింది పులి. హఠాత్తుగా  పులిని చూసేసరికి భయంతో బిత్తరపోయాడు బాటసారి. కానీ,పులి చేతిలో ధగధగ మెరుస్తున్న బంగారు కడియాన్ని చూసేటప్పటికి.. అంతటి భయంలోనూ అతడిలో ఆశ కలిగింది. లేని ధైర్యం తెచ్చుకొని పులితో..

 నన్నెందుకు పిలుస్తున్నావ్.. నాతో నీకేంటి పని అని బింకంగా అడిగాడు. అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమురాలిలా నటిస్తూ.. చాలా సౌమ్యంగా…” ఓ బాటసారి..నిన్నుచూస్తుంటే, ఎందుకో గానీ నాకు జాలి కలిగింది..నువ్వు బాగా కష్టాలు అనుభవిస్తూ.. దరిద్రంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు.. నీలాంటి వాడికి ఏదైనా సాయం చేయాలనిపిస్తోంది… అందుకే నిన్ను పిలిచాను అని చెప్పింది పులి.

”నువ్వు నాకేం సాయం చేయగలవు.. నా మానాన నన్ను పోనీయ్‌.. నగారానికి వెళ్లి ఏదైనా పని చూసుకుంటాను”.. అన్నాడు బాటసారి

”ఇదిగో ఇలా చూడు, ఇది బంగారు కడియం.. చాలా విలువ చేస్తుంది.. నాకు దీనితో ఉపయోగం లేదు. నీలాంటి వాడికి ఇద్దామనే  నా సంకల్పం” అంది పులి

 ”చాలా సంతోషం.. నీ ఉద్దేశం చాలా బాగుంది. కానీ, దాని వలన నీకు కలిగే ప్రయోజనం ఏమిటి?” అడిగాడు బాటసారి

” సెహబాష్ చాలా మంచి మాట అడిగావు.. నా దగ్గర ఉన్న ఈ బంగారు కడియాన్ని దానంగా ఇవ్వడం వలన నాకు పుణ్యం కలుగుతుంది. నీకు దరిద్రం  తీరుతుంది” అని చెప్పింది పులి.

అప్పుడు ఆ బాటసారి…” నీకు వచ్చే పుణ్యం సంగతి ప్రక్కనపెట్టు.. నువ్వొక క్రూర జంతువువి. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తావు.. నీ మాటలు నమ్మడమెలా?” అన్నాడు సందేహంగా…

నీవన్నది నిజమే.. వయసులో ఉండగా ఎందరినో చంపాను.. ఎన్నో ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాను… దాని వలన ఎన్నో పాపాలను మూటగట్టుకున్నాను. నా బాధను చూసిన ఒక మునీశ్వరుడు.. నే చేసిన పాపాలను నిర్మూలించుకోవాలంటే  దానాలు చేయడమే మార్గమని సెలవిచ్చాడు. అందుకే, ఈ బంగారు కడియాన్ని నీలాంటి యోగ్యుడికి ఇచ్చి పాప ప్రక్షాళన చేసుకుందామనుకుంటున్నాను” అంది పులి.

పులి అంతలా చెప్పేసరికి, బాటసారికి బంగారు కడియంపై ఆశ రెండింతలయ్యింది.. కానీ తటపటాయిస్తూ.. నీ మాటలు నిజంగానే తోస్తున్నాయి.. కానీ, నిన్ను చూస్తే ఎందుకో గాని భయం కలుగుతోంది.. నన్ను వదిలేయ్, నేను వెళ్తాను” అంటూ వెనుదిరిగాడు బాటసారి..

అప్పుడా పులి…” ఓ బాటసారి ఆగు.. నా మాట విను.. నన్ను నమ్ము… చేతికి అందివచ్చిన బంగారాన్ని చేజేతురాలా జారవిడుచుకోకు.. నీ భయం నాకర్థమయ్యింది.. నీ సందేహాన్ని నేను తీరుస్తాను.

నేను వయోభారం చేత అనేక రోగాల భారిన పడ్డాను.. ముసలిదానినై పోయాను.. ఎటూ లేవలేను, కదలలేను, పరిగెత్తలేను.. నా గోళ్లనీ మొద్దుబారిపోయాయి.. పళ్లూడిపోయాయి.. కళ్లు కూడా సరిగ్గా కనిపించడం లేదు..” అని చెప్పింది.

పులి చెప్పిన మాటలన్నీ విని బాటసారి, ఎంతో విలువైన బంగారు కడియం సొంతమవుతోంది అని లోలోన సంబరపడ్డాడు. పులి మాటలకు పూర్తిగా ధైర్యం వచ్చింది..

పులి దగ్గరకు వెళ్లి..” సరే! నువ్వు చేసిన పాపాలను పోగొట్టుకోవాలనుకుంటున్నావ్ కాబట్టి.. బంగారు కడియాన్ని దానంగా స్వీకరించడానికి నేను సిద్ధం” అన్నాడు బాటసారి. కష్టపడకుండా, కదలకుండా ఆహారం దొరికింది అనుకుంటూ ఆనందపడింది పులి..

బాటసారితో పులి..” నా దగ్గరున్న బంగారు కడియం నీకు దానంగా ఇస్తాను. అయితే, ముందుగా చెరువుకి వెళ్లి శుచిగా స్నానం చేసిరా” అని అంది.

మితిమీరిన ఆశతో ఉన్నాడేమో.. ఆ బాటసారి మరేమీ ఆలోచించకుండా స్నానానికి చెరువు దగ్గరకు వెళ్లాడు. చెరువంతా బురద బురదగా ఉంది. కాలు పెట్టేసరికి జారిపోతున్నాడు. బంగారు కడియం పై ఉన్న వ్యామోహం చేత తెగించి స్నానానికి వెళ్లాడు. వెంటనే, బురదలోకి దిగబడిపోయాడు. కాళ్లు బయటకు తీద్దామంటే రావడం లేదు… వెంటనే, భయంతో.. ”రక్షించండి.. రక్షించండి” అంటూ అరిచాడు..

అలా అరవకు.. నేనున్నానుగా రక్షించడానికి అంటూ అడుగులో అడుగేసుకుంటూ మెల్లగా వచ్చి బాటసారి మీదకు ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి, కడుపార తిని, ఆనందంగా విశ్రాంతి తీసుకుంది.

Matlade Guha katha- Telugu Moral Stories for kids – Chandamama kathalu – Panchatantra tales

నక్క జిత్తు-సింహం చిత్తు

ఒక అడవిలో కేసరి అనే సింహం ఉండేది. ఆ సింహం అడవిలో జంతువులన్నిటికి ఆధిపత్యం వహిస్తూ రారాజు గా దర్పం వెలగబెట్టేది.  ఒక రోజు ఆ సింహానికి  అడవి మొత్తం ఎక్కడ తిరిగినా ఆహారం దొరకలేదు.  బాగా ఆకలితో ఉన్న సింహాం వేటాడేందుకు ఏదైనా జంతువు  దొరుకుతుందేమోనని  ఆశగా అడవి మొత్తం తిరగసాగింది. ఇలా, ఆకలితో తిరుగుతుండగానే సాయంత్రం అయ్యింది.

దీంతో, తీవ్ర నిరాశతో సింహం తన ఇంటికి తిరుగుముఖం పట్టింది. అలా వస్తుండగా, దారి మధ్యలో ఓ పెద్ద గుహ కనిపించింది. అప్పుడు ఆ సింహం మనసులో ఇలా అనుకుంది.. ”ఈ పెద్ద గుహలో ఏదో ఒక జంతువు కచ్చితంగా ఉండే ఉంటుంది.. సాయంత్రం అయ్యింది కాబట్టి కచ్చితంగా ఆ జంతువు గుహలోకి రావాల్సిందే. నేను ఈ గుహలో దాక్కుని.. ఆ జంతువు వచ్చిన వెంటనే దాన్ని వేటాడి నా ఆహారంగా తీసుకుంటాను” అని గుహలోపలకి వెళ్లి నక్కి కూర్చుంది.

ఆ గుహ ఓ జిత్తులమారి నక్కది.  కొద్దిసేపటి తర్వాత కూనిరాగాలు తీసుకుంటూ నక్క తన గుహకు రానే వచ్చింది. అయితే, గుహలోపలికి వెళ్లబోతుండగా, అక్కడక్కడా సింహం  కాలి జాడల గుర్తులు కనపడటంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ” ఓరిదేవుడా.. సింహం నా గుహలోకి వచ్చినట్లుంది.. లోపలికి వెళితే నా జీవితానికి ఇదే ఆఖరి రోజు కావచ్చు. ఇంతకీ, లోపల  సింహం ఉందో లేదో తెలుసుకోవడం ఎలాగా?” అని మనసులో భయపడసాగింది.

ఇంతలో నక్కకు ఓ చక్కటి ఉపాయం తట్టింది. వెంటనే, గుహ సమీపంలోనికి పోయి..” ఓ గుహా! ఏమిటి ఈ రోజు నన్ను చూడగానే ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు. రోజూ నేను రాగానే నన్ను ఆటపట్టిస్తావు కదా! ఈ రోజు నోరు మెదపడం లేదే! ఏదైనా భయంకరమైన జంతువును చూసి నువ్వు భయపడ్డావనుకుంటా. ఆ భయంతోనే నీకు నోటి నుంచి మాట రావడం లేదనుకుంటా? నేను ఇన్ని మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటే.. నీ గుహలోకి నేను రావడం నీకు ఇష్టంలేదనకుంటా? సర్లే, అయితే ఈ రోజు నుంచి నీ గుహలోకి నేను రానులే.. ఈ రోజు నుంచి నీకు నాకు మాటల్లేవ్! నేను వేరే గుహ చూసుకుంటాను” అంది.

 ఆ మాటలు విన్న సింహం ఆశ్చర్యపోతూ… దీని దుంపతెగ. ఇది భలే  విచిత్రంగా ఉందే.. గుహలు కూడా మాట్లాతాయేటి. ఆ నక్కకు తెలిసిన విషయం కూడా నాకు ఇప్పటిదాకా తెలియలేదేటి! ఇదే గనుక నిజమైతే.. ఇందాక నేను లోపలికి రావడం ఈ గుహ చూసింది కదా… అందుకే, భయంతో మాట్లాడటం లేదనుకుంటా! ఎంతైనా నేను అడవికి రాజును కదా! నన్ను చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. 

చేతికి చిక్కిన ఆహారం ఈ గుహ వల్లే పోయేట్టు ఉంది. సరే ఈ గుహ మాట్లాడకపోతే, దాని బదులు నేనే… కాస్త గొంతు మార్చి మాట్లాడతాను. ఆ నక్క ను లోపలికి రప్పించి, దాన్ని చంపి ఈ రోజు సుష్టుగా భోజనం చేస్తా” అని మనసులో అనుకుంది.

వెంటనే అతి తెలివితో తన గొంతును సింహం కాస్త మార్చి, ” అదేమీ లేదూ మిత్రమా.. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికే ఇంత సేపు నేను మౌనంగా ఉన్నాను. అసలు నిన్ను చూడకుండా నాకు రోజు గడుస్తుందా? నువ్వు లేకుండా నేను ఉండగలనా!  మనిద్దరిది జన్మజన్మల స్నేహ బంధం.. వెంటనే లోపలికి రా.. నీతో  చాలా కబుర్లు చెప్పాలి” అని అంది. 

ఆ మాటలు విన్న వెంటనే, జిత్తులమారి నక్క..  ” ఓరి దేవుడా.. లోపల సింహముంది.  నేను ఈ ఆలోచన  చేయకపోతే, ఈపాటికి దాని నోటికి ఆహారంగా మారిపోయేదాన్ని. ఈ సింహం తెలివి తెల్లారినట్టే ఉంది..

అయినా, రాళ్లు,రప్పలు.. గుహలు , గుట్టలు ఎక్కడైనా మాట్లాడతాయా! దేవుడు దీనికి పెద్ద శరీరమైతే ఇచ్చాడు..కానీ బుర్రలో కాస్తైనా గుజ్జు పెట్టలేదు” అని అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకుంది.

అందుకే అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు పై కథలో నక్కలాగా కంగారుపడకుండా.. భయపడకుండా చక్కటి ఉపాయంతో వాటిని అధిగమించాలి.

బయట పడ్డ గాడిద బంఢారం – Telugu Moral Stories for children _ Kids Stories in Telugu 

లింగాపురం అనే గ్రామంలో  రాజయ్య అనే చాకలి ఉండేవాడు. ఆ ఊరిలో బట్టలు ఉతికి, వారిచ్చే డబ్బుతో జీవనం సాగించేవాడు. చాలీచాలని అతని సంపాదన కుటుంబ అవసరాలకే సరిపోయేది కాదు. ఆ చాకలి దగ్గర రెండు గాడిదలు ఉండేవి. అవి రోజూ బట్టలు మూటలను ఇంటి నుంచి చెరువుకీ, చెరువు నుంచి ఇంటికీ మోస్తూ, చాకలికి సహాయంగా ఉండేవి.

కొన్నాళ్లకు ఆ రెండు గాడిదలతో ఒక గాడిద బాగా ముసలిదైపోయింది. అది అంతకుముందులా బట్టల మూటలు మోయలేకపోయేది. కాళ్లలో శక్తి లేక ఎక్కడపడితే అక్కడ కూలబడిపోయేది.

ఆ ముసలి గాడిదను పోషించలేక దానిని వదిలేద్దమనుకున్నాడు రాజయ్య. ఆ ముసలి గాడిదను ఓ కసాయి వాడికి అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. చాకలి ఉద్దేశాన్ని కనిపెట్టిన ఆ ముసలి గాడిద…

 ”ఓ యజమానీ! ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? ఇన్నాళ్లూ.. నాకు శక్తి ఉన్నంత వరకు నీకు సేవ చేస్తూనే వచ్చాను. ఇప్పుడు ముసలిదానిని అయిపోయానని, నన్ను కసాయివాడికి అమ్మేస్తావా” అంటూ ఏడ్చింది.

దానికి ఆ చాకలి  బదులిస్తూ..”అమ్మక నన్నేం చేయమంటావ్‌.. నా సంపాదన నా అవసరాలకే సరిపోవడం లేదు. నిన్ను కూర్చోపెట్టి ఎక్కడ  మేపగలను. నీకు పెట్టే తిండి కూడా దండగ” అంటూ కసురుకున్నాడు

 

అప్పుడు ఆ గాడిద ఏడుస్తూ..

              ” అయ్యా! ఇన్నాళ్లు నీతోనే ఉన్నాను. కష్టం దాచుకోకుండా నీకు చాకిరీ చేశాను. నా మీద దయతల్చు. కసాయివాడికి అమ్మొద్దు” అంటూ వేడుకుంది. ఆ ముసలిగాడిద పదే పదే వేడుకోవడంతో, ఆ చాకలి మనసు కరిగింది.

” సరే.. !  భయపడకు.. కసాయివాడికి నిన్ను ఇవ్వనులే. అలా అని నిన్ను రోజూ పోషించలేను. ఏదో ఒక ఉపాయం ఆలోచించి నిన్న బయటపడవేస్తాను” అన్నాడు చాకలి. చాకలి ఆ మాటలు అనేసరికి ముసలి గాడిదకు ధైర్యం వచ్చింది.

”హమ్మయ్య! మా యజమాని నాపైన జాలి తలిచాడు.. కసాయి వాడి బారినపడకుండా బతికిపోయాను” అని తనలో తాను అనుకుంటూ ఒక మూలకెళ్లి కూర్చుంది”  ఆ ముసలిగాడిద

అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్న ముసలిగాడిదను మేపడం చాకలికి చాలా భారంగా తోచింది. దాంతో అనేక రకాలుగా ఆలోచించాడు. చివరికి ఒక ఉపాయం తట్టింది. సంతకు వెళ్లి ఒక పులితోలును తీసుకువచ్చాడు.

ముసలిగాడిదను పిలిచి…”నిన్ను కూర్చోబెట్టి మేపడం నాకు చాలా కష్టంగా ఉంది. ఆ విషయం నీకు తెలుసు. అందుకే బాగా ఆలోచించి.. ఈ పులితోలును తెచ్చాను. హాయిగా ఈ పులితోలును కప్పుకుని రాత్రి పూట ఈ ఊరి పొలాల్లో పడి, నీ ఇష్టం వచ్చినట్లు కడుపునిండా తిను. అందరూ నిన్ను పులి అనుంటారు… ఎవరూ నీ జోలికి రారు” అన్నాడు చాకలి

 

చాకలి చెప్పిన మాటలకు ‘సరే’ అని చెప్పి అతడిచ్చిన పులితోలు తీసుకుంది ముసలిగాడిద.

ఆ రాత్రి చాకలి తెచ్చిచ్చిన పులితోలు కప్పుకుని, బాగా చీకటి పడ్డాక ఊరి చివర ఉన్న జొన్నచేల వైపు  వెళ్లింది.  ఆ చేలకు కాపలాగా ఉన్నవాళ్లు దాన్ని చూసి,నిజమైన పులి అనుకుని భయపడి పారిపోయారు.

 ఆ ముసలి గాడిద దర్జాగా అర్ధరాత్రి వరకు కడుపునిండా మేసి, ఇంటికి వచ్చింది. ఆ రోజు నుంచీ ప్రతీ రోజూ… రాత్రి ముసలిగాడిద పులి తోలు కప్పుకుని ఊరి మీద పడి జొన్న చేల్లో కావలసినంత మేత కడుపార తినేది. పొద్దున్నయ్యేసరికి పులి తోలు తీసేసి  ఏమీ తెలియనట్లు ఓ మూల ఒద్దికగా  కూర్చునేది.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. రోజూ దగ్గరలో ఉన్న తోటలలోకి, చేలల్లోకి పోయి సుష్టుగా మేసి రావడం ముసలి గాడిదకు అలవాటుగా మారింది. అప్పనంగా తిని.. తిని ముసలి గాడిద బాగా బలిష్టంగా కూడా తయారయ్యింది.

చేలు పాడైన రైతులు ఎంతో బాధపడేవారు. కానీ, పులి కదా అని ఎవరూ దాని జోలికి వెళ్లడానికి సాహసించే వారు కారు. ఇది ఇలా ఉండగా, ఒక రోజు శివయ్య అనే రైతుకు ఒక అనుమానం వచ్చింది.

”పులి ఎక్కడైనా గడ్డి మేస్తుందా?.. అది పూర్తిగా మాంసాహారి.. జంతువులను వేటాడి పచ్చి మాంసం తింటుంది. ఎట్టి పరిస్థితులలోనూ పచ్చగడ్డి తినదు. మరి, ప్రతీ రోజు చేలల్లో పడి మేస్తున్నదెవరు?

 

ఇందులో, ఏదో మోసం ఉంది” అని రకరాకాలుగా  ఆలోచించాడు. ఆ విషయమేంటో తేల్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి  శివయ్య పొడవైన కత్తి, బలమైన కర్ర తీసుకుని, పొలం దగ్గరకు వెళ్లాడు. గట్టు మీద ఉన్న వేప చెట్టు పైకి ఎక్కి గుబురుగా ఉన్న కొమ్మల చాటున నక్కి కూర్చున్నాడు.

చీకటి పడటంతో ముసలి గాడిద అలవాటు ప్రకారం, పులి తోలు కప్పుకుని చేల వైపుకి వచ్చింది.. చుట్టూ చూసింది. ఎవరూ చూడలేదని అనుకొని జొన్నచేల్లో దిగి కంకులు తినడం మొదలుపెట్టింది.

కొద్ది సేపు మౌనంగా చెట్టు మీద కూర్చున్న శివయ్య, పెద్దగా శబ్దం చేస్తే ఆ పులి పారిపోతుందని భావించాడు. చెట్టు మీద నుంచే గొంతు మార్చి గట్టిగా అరవసాగాడు.

ఆ శబ్దాలు ముసలి గాడిద చెవిన పడ్డాయి. బొంగురుగా ఉన్న ఆ అరుపులు విని, రెండో గాడిదను కూడా పంపాడనుకుంది.

” నేను ఇక్కడ ఉన్నాను… ఇటు వైపు రా” అన్నట్లు పెద్దగా ఓండ్ర పెట్టింది ముసలి గాడిద. ఆ అరుపు విన్న శివయ్యకు పులి అసలు రంగు తెలిసిపోయింది. ‘పులి తోలు కప్పుకున్న గాడిద’ అనే రహస్యం అర్థమయ్యింది. ఎంత మోసం.. ఎంత మోసం దీనిని ఊరికే వదలకూడదు అని కర్రతో కట్టి, కత్తితో పొడిచి  నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు శివయ్య.

 

నక్కకు చిక్కిన పీతలు- 

అనగనగా ఒక నక్క ఉండేది. అది మహా జిత్తులమారి. కష్టపడకుండా ఆహారాన్ని తన మాయోపాయాలతో సంపాదించు కునేది. ఒకసారి ఆ నక్క ఒక నదీ తీరాన కూర్చుని భోరు భోరు మని ఏడవసాగింది.

 ఆ ఏడుపు విని.. ఆ చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలన్నీ బయటకు వచ్చాయి. ఆ నక్క దగరకు వచ్చి ‘ఎందుకు అంతలా ఏడుస్తున్నావ్’? అని అడిగాయి.

అప్పుడు ఆ నక్క ‘అయ్యో నా బాధ నేను ఏమని చెప్పను, నా బృందంలోని నక్కలన్నీ కలిసి నన్ను అడవిలోంచి తరిమేశాయి’ అని ఏడుస్తూనే సమాధానం చెప్పింది.

 అప్పుడు పీతు జాలి పడి… ‘అవన్నీ ఎందుకలా చేశాయి’? అని అడిగాయి. అప్పుడు నక్క బాధ నటిస్తూ ‘ఎందుకంటే అవన్ని మిమ్మల్ని తినేయాలని పన్నాగం పన్నాయి, దానికి నేను అడ్డుపడి వద్దని వారించాను, అయినా మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయో… నాకు అర్థం కాలేదు’ అని అంది.

 అప్పుడు పీతలన్ని, నక్క తో ‘అయ్యో అలా జరిగిందా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు’ అని అడిగాయి.

 ఆ మాటలకు నక్క కన్నీళ్లు పెట్టుకుంటూ…’ ఏమో తెలియదు, కానీ నేను ఏదైనా పని చూసుకోవాలి’ అని దీనంగా జవాబిచ్చింది.

 ఆ సమయంలో పీతలన్ని కలిసి ఆలోచించాయి… “మనల్ని రక్షించాలి అని అనుకోవడం వల్లే, ఈ నక్క కి ఆపద వచ్చింది… దీనిని మనమే ఆదుకోవాలి” అని నిర్ణయించుకున్నాయి. నక్కతో “ఈరోజు నుంచి నువ్వు మా అందరికీ కాపలాగా ఉండు” అని చెప్పాయి.

నక్క వెంటనే ఒప్పుకొని తన కృతజ్ఞతలు చెప్పి అప్పటి నుంచి రోజంతా పీతల తోనే ఉండి కథలూ కబుర్లు చెప్పి వాటిని నవ్విస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకసారి పున్నమి వచ్చింది. నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోతూ ఉంది.

 ఆ సమయంలో నక్క పీతల దగ్గరకు వచ్చి “మిత్రులారా! మీరెప్పుడైనా ఈ చల్లని పున్నమి వెన్నెలలో విహరించారా” అని అడిగింది.

 అంతేగాక అలా విహరిస్తే చాలా బావుంటుంది అని వాటికి ఉత్సాహం కూడా ఇచ్చింది.

 అప్పుడు పీతలు, నక్కతో… “మేము మా భయం కొద్దీ ఎప్పుడు మా కన్నాలను దాటి ఎక్కడకు వెళ్లలేదు” అని చెప్పాయి. అ

అప్పుడు నక్క “మీకేం భయం లేదు, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను” అని చెప్పింది.

అంతేకాకుండా “నేను మీకు అండగా ఉంటే మీకు భయం ఏంటి” అని ధైర్యం చెప్పింది.

 అలా చెప్పడంతో పీతలు వెన్నెల్లో విహరిద్దాం అని నక్కతో కలిసి బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది… పీతలన్ని నక్క ఎందుకు అలా మూలుగుతోంది అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఒక్కసారిగా నక్కలన్నీ వచ్చి పీతల పైబడ్డాయి ఆ హఠత్పరిణామానికి పీతలన్నీ బెదిరిపోయి అటూ ఇటూ పరిగెత్తడం మొదలుపెట్టాయి. కానీ నక్కలన్నీ… పీతలను పట్టుకుని తినేశాయి.  ఎలాగోలాగా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలకు చేరుకున్నాయి. జిత్తుల మారి నక్క చేసిన కుతంత్రం తలచుకుని చాలా బాధ పడ్డాయి.

 కాబట్టి దుష్టులతో సావాసం చేస్తే ప్రమాదం అని తెలుసుకోవాలి

మాట తప్పని ఆవు

ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ గొడవపడకుండా, అసత్యమాడకుండా, నిజాయితీతో జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా ఒక పులి చూపు దాని మీద పడింది. బలిష్టంగా నిగ నిగ లాడుతున్న ఆవును చూడగానే, అప్పటివరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవుపైకి దూకబోయింది పులి.

ఇక పంజా విసురుతుందనగా…ఆవు పులిని ఉద్దేశించి ఇలా అంది…

‘పులి రాజా! కొంచెం ఆగు. నేను చెప్పే మాటలు కాస్త ఓపికగా, శాంతంగా విను. ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి కనీసం రెండు వారాలు కూడా కాలేదు. పచ్చిక తినడం కూడా ఇంకా నేర్చుకోలేదు. దానికి ఇంకా లోకం తెలియదు. నేను మేతకు రాగానే. తిరిగి ఎప్పుడు తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, అలాగే అందరితో ఎలా నడుచుకోవాలో, కొన్ని మంచి బుద్దులు నేర్పి వస్తాను. ఆ తరువాత నన్ను భక్షించు’ అని వేడుకుంది.

ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వింది…

‘ఆహా ఏమి మాయ మాటలు? ఇంటికి వెళ్లి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకున్నావా? నేనేం వెర్రి దానను కాను’ అంది కోపంగా. పులి మాటలకు… ఆవు. నీవు అలా అపార్ధం చేసుకోకు. నేను అసత్యం పలికే దానను కాను. ఒకసారి మాట ఇచ్చితప్పే దానను కాను? ఒక్కటి మాత్రం నిజం. ఎవరికైనా, ఎప్పటికైనా చావు తప్పదు. నాకు చావు ఇప్పుడే వచ్చిందని అనుకుంటాను. ఆకలిగొన్న నీకు… నేను ఆహారం కావడం కంటే, నేను బతికి పరులకు చేసే మేలు ఇంకేముంటుంది? అయితే, ఒక్కమాట. నాకు చావంటే ఎలాగూ భయం లేదు. నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను. కానీ, నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు. అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది. రేపటి నుంచి ఎలాగో తన బతుకు తాను బతకాలి. దానికి మంచి చెడ్డలు, లోకం పోకడ చెప్పి వస్తాను.

అలాగే నా బిడ్డనుచూసి, దాని ఆకలి తీర్చి… నీకు ఆహారం కావడానికి నాకు ఎలాంటి అభ్యం తరం లేదు’ అని ఆవు నిజాయితీగా, మిక్కిలి నమ్మకంతో చెప్పింది.

ఆహా.. జనంల తిరుగుతూ బతికే జంతువులు మీరు. మీ మాటలు నమ్మేదెలా? అయినా సరే. నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఊళ్లలో నివసించే నీలాంటి జంతువులలో నీతి నీజాయితీ ఎంత ఉందో చూస్తాను. వెళ్లి రా…’ అని పులి గంభీరంగా పలికింది.

 

ఆవు గబగబా ఇంటికి వెళ్లింది. దూడకు కడుపు నిండా పాలు ఇచ్చింది. దాని శరీరాన్ని ప్రేమగా..తనివితీరా స్పృశించింది. కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో… ఇలా చెప్పింది. నాయనా! బుద్ధిగా జీవించు. అందరితో మంచిగా మసులుకో. తోటి వారితో స్నేహంగా ఉండు. ఇచ్చిన మాట నిలుపుకో. ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకు. మంచి ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో’ అని బుద్ధులు చెప్పి భారమైన హృదయంతో అడవికి బయలుదేరింది.

అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి, దూరం నుంచి ఆవు రావడం చూసి ఆశ్చర్యపోయింది, ఆహా… ఈ ఆవు ఎంత నమ్మకమైనది, అన్న మాట ప్రకారం నాకు ఆహారం అవ్వడనికి తిరిగి వస్తుంది, తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతో గొప్పది, ఇలాంటి సత్యవ్రతశీలిని చంపితే నాకు పాపం తప్పదు అని మనసులో అనుకుంది.

ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాలా… నువ్వు ఎంత సత్యవంతురాలివి, ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయకుండా నాకు ఆహారమవడానికి వచ్చిన నిన్ను చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది, నిన్ను అనుమానించినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఇంకో విధంగా తీర్చుకుంటాను. నువ్వు ఇంటికి పోయి నీ బిడ్డతో హాయిగా జీవించు అంది. ఆవు సంతోషంతో ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది.

కాకి – మిణుగురు పురుగు- Moral Stories in Telugu for kids

కాకి – మిణుగురు పురుగు

అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు ఉండేది.  అది అడవిలో సంతోషంగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉండేది.

ఒక రోజు ఒక కాకి మిణుగురు పురుగుని చూసింది. వెంటనే దానిని అమాంతం  పట్టుకుని తినబోయింది,  నోరు తెరిచి కాకి తనను మింగేసే లోపల మిణుగురు పురుగు “మిత్రమా! నేను చెప్పే ఒక మాట విను… నా మాట వింటే నీకే మంచిది” అని చెప్పింది.

 వెంటనే కాకి “ఏంటది తొందరగా చెప్పు” అని అంది.

 అప్పుడు మిణుగురు పురుగు “నన్ను ఒకదానిని తింటే, నీక ఆకలి ఏం తీరుతుంది, నీకు నా లాంటి చాలా పురుగులు ఉన్న చోటు ఒకటి చూపిస్తాను,  నన్ను ఇప్పుడు తినేస్తే, నీకు ఆ చోటు తెలియదు కదా” అని అంది.

మిణుగురు పురుగు మాటలకి కాకి లో అత్యాశ మొదలయ్యింది. వెంటనే కాకి “సరే తొందరగా చూపించు” అని అంది.

 అప్పుడు ఆ మిణుగురు పురుగు కాకిని ఒక చోటికి తీసుకెళ్ళింది. అక్కడ కొంతమంది మనుషులు చలి మంట కాచుకుంటున్నారు. కాసేపటికి వాళ్లు వెళ్లిపోయారు.

 ఆ చలి మంటల్లోంచి కొన్ని నిప్పు రవ్వలు గాలిలోకి ఎగురుతున్నాయి. ఆ నిప్పురవ్వ లను కాకి కి చూపించి, “అదిగో అవే నాలాంటి మిణుగురు పురుగులు” అని చెప్పింది.

కాకి వెంటనే ఏమీ ఆలోచించకుండా నోరు తెరుచుకుని నిప్పు రవ్వలు పట్టుకుని మింగేసింది. అంతే దానికి నోరంతా కాలిపోయింది. బాబోయ్ ఇవేమి పురుగులు, నోరంతా కాలిపోయింది, వీటిని మనం తినలేము అని అనుకుంటూ అక్కడ నుండి ఎగిరిపోయింది. కాబట్టి సమయస్ఫూర్తిని ఉపయోగించి ప్రమాదాల నుండి తప్పించుకోవాలి.

నీతిః దేహ బలం కన్నా బుద్ధి బలం మిన్న